ఫీడులు:
టపాలు
వ్యాఖ్యలు

గోదారి వెంటపడే..

కిందనున్న మన్నుతడి కి అరికాలిన గిలిగింతలు.. కాలు కదపబుద్ధేకాదు. కదపకుంటే చలికి తిమ్మిరవుతోంది. అంత ఆస్వాదనలోనూ అడుగు తీసి అడుగేయక తప్పదు. అరికాలిన మొదలై ఉదరం దాటి వెన్నూ, మనసూ తాకుతూ చెవుల ద్వారా కళ్ళనీ, ఆఖర్న చిరునవ్వై పెదాలనీ మెరుస్తోంది. అణువణువూ స్పందిస్తే, మనసు మయూరమై కలిగిన అత్యంత సహజమైన చిరుస్మితం. మనసునీ మస్తిష్కానీ కూడా తేలిక చేసేసే చిన్న సంతోషం.

చెలిగోదావరి అరికాలు మొదలు, పాదమంతా తాకుతూ సరదా చేస్తుంటే, ఆ ముచ్చట్లో పడి చిన్న చిన్న అడుగులతో చాలా దూరమే వచ్చినట్లు.. నీటిమధ్య కుతూహలంగా నిలువునా శిరసెత్తి ఆకాశాన్నే చూస్తున్న రాళ్ళని చూసి స్ఫురించింది. మరెన్ని సుఖాలు చూసినా, చావుకు ముందు క్షణం కూడా నన్ను వదలదనుకుంట ఈ శీతలస్మృతి వలన కలిగిన ఆనందం.

చల్లగా అరికాళ్ళు నీటిలో ముంచేసి ఒకరాయిపై కూర్చున్నా.

గోదారి నించి మనసు మరోదారి మళ్ళితే..

చిన్నప్పుడూ..

“ఇంటి ముందు ఆటతో మొదలైన పరుగుతో గుంపుగా వీధులవెంట పరిగెడుతూ సత్రం దాటి, హనుమంతుడి గుళ్ళో గంటలు తెగ మోగించి, మెట్లమీద పడుతూ లేస్తూ గోదావరి ఇవతలున్న ఇసకపైకి దూకేవాళ్ళం. అక్కడ పరుగులు మళ్ళీ మొదలు. యాత్రికుల స్నానాలకి కాస్త ఇవతలికి వస్తే దోసిళ్ళతో ఇసుకలు తవ్వుతూ ఆటలు షురూ.

null

రెండొ దోసిలికే తడి ఇసక తగిలే!! మరో రెండు దోసిళ్ళు తీస్తే మళ్ళీ నీరు.. ఎన్నేసి దోసిళ్ళ ఇసకో సంపాదించి ఇక్కడే గుళ్ళూ, ఇళ్ళూ… కోటలు కూడా కట్టాం. ఒకరి కోటని ఒకరు కూలదోసుకుని యుద్ధాలు చేసుకుని.. రక్తపాతం..”

తెలియకుండానే ఫక్కని నవ్వేసాను.

అటుగావచ్చేవాళ్ళు ఆశ్చర్యంగా చూడరా మరి.. నేనే ఆలోచనలో ఉన్నానో వాళ్ళకేం తెలుసు పాపం. ఎవర్తో పిచ్చిదనుకుని ఉంటారు.

“రక్తపాతం కాదా మరి.. గోళ్ళతో గిల్లేసుకుంటే”

నా జీవితంలో కొన్ని క్షణాలే.. ఎంతో చిన్నదే ఐనా పరిపూర్తిగా మన్సుని రంజింపచేసే ఆనందం. ఇక కార్తీకమాసం రాగానే..

” మామూలప్పుడైతే ఎలా ఐనా పరుగులు పెట్టొచ్చు. అమ్మ ఉంటేనా.. ‘ కుదురుగా ఉండమని ‘ గొడవ. చేతిలో అరటి డొప్పల్లో దీపాల వేడి, నీట మునిగినంత మేరా వెచ్చగా.. హాయిగా.. పైకి లేస్తేనే.. ఎముకలు కొరికే చలి.

వెంటనే రానూ బుద్ధి కాదు.. అక్కడే ఉండనూ బుద్ధి కాదు..
నన్నలా లాగేసే గోదారికే బుద్ధి లేదు. అమ్మ అరుస్తుందని తెలీదూ!??”

2స్పందనలు
19/07/2009
మురళి (19:54:35) :

బాగుందండి.. గోదారి గురించి యెంత రాసినా ఇంకా మిగిలే ఉంటుంది…

జవాబు

19/07/2009
యువ (22:56:15) :

నాకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. (ఇలా చెప్పొచ్చా! ఈ మధ్య ఎవరో ఇలాంటి పదప్రయోగాల మీద పెద్ద వ్యాసం రాసారు. పిచ్చపిచ్చగా నచ్చకపోతే చాలా బాగా అనుకోండి.)

మొదటి పేరా అయితే మరీమరీ…

“నన్నలా లాగేసే గోదారికే బుద్ధి లేదు. అమ్మ అరుస్తుందని తెలీదూ!” – ఎంత గారంగా చెప్పారు.
-యువ

“సులేఖిని పేరుతో బ్లాగ్ మొదలుపెట్టి, అందులో రాసిన ఈ టపాకు స్పందించిన మురళి గారికీ, యువ గారికీ ధన్యవాదాలు.{క్షమించాలి, దాని పాస్వర్డ్ మర్చిపోయను :) } – సింధు”

ఎన్ని’కల’లు

*** *** *** *** *** ***

ఎన్నికల మునుపు, 2004 లో..

” బంధుప్రీతి, అవినీతి, అరాచకాలకి దూరంగా, పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు విధులు నిర్వహిస్తే, మన వనరులు మనకు సరిపోతాయి, అలా కాని పక్షంలోనే పేదరికం పెల్లుబికేది.. “

… ఆవేశాన్నణుచుకుని ఎకనామిక్స్ లెక్చరర్ ఇంగ్లిష్ మీడియం కాలేజ్‌లో అచ్చమైన తెలుగులో, చెప్పిన మాటలు కొందరికి అర్థం కాలేదు కూడా.

ఆ మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. అయితే, తప్పంతా శాసనసభ్యులదేనా? ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా వారిని ఎంపిక చేసిన ప్రజలది తప్పు కాదా? అంటే మన తప్పు లేదా??..
” అవునంటే అది ఆత్మ వంచనే “..

60 వసంతాల పైబడిన మేరువు మన భారతి. విశ్వసుందరులనీ, బహు సంపన్నులనీ ఒకరిద్దరు దేశీయుల మొహాలు చూబెడితే, వారి జపం చేస్తూ దశాబ్దాలు కాలక్షేపం చేయగల నిరర్థక వారసులను మోస్తున్నది మన భూమి.

పదవుల్లో ఉండి దేశ విదేశాలు చక్కర్లు కొట్టటం, ఎన్నికలకు ముందు ప్రచారం లోనో,ప్రచార సంబంధిత సభలు, రోడ్ షో లు మినహా, పథకాల అమలు, మారుమూల మగ్గుతున్న జాతుల అభివృద్ధి, ప్రభుత్వ రంగ పనితీరు, వంటి వాటిని గమనించే చిత్తశుద్ధి ఎవరైనా చూపారా??

చిత్తశుద్ధా!? “చిత్తమే” అరచేత వైకుంఠం, ఇక దానికి శుద్ధేమిటి??

” మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి ” అనెవరైనా అంటే, కళ్ళు మూసుకుని, కుళ్ళు కంపులో కూడా నేతి వాసన వెతుక్కునే అమాయకులు(??), ‘మాయ’ ని నమ్మే అచేతనులు, ‘చేతలు మావంటే’ తలలూపి, తలరాతలు అవహేళనవుతుంటే, దిగ్భ్రాంతితో ముక్కున వేలేసుకుని చూడటం మినహా, ఈ స్థితిని మార్చే ‘శక్తి’ తమకు ఉందనీ తెలియని వారు, తెలుసుకునే ప్రయత్నం చేయనివారూ, చెబితే విననివారూ ఎవరయా అంటే..

విచక్షణా రాహిత్యానికి నిలువుటద్దంగా మారుతోన్న మన అసభ్య సమాజ నిర్జీవ సభ్యులు.

” నిర్జీవ సభ్యులా!!!!!!!?? ఏం మాట్లాడుతున్నారు మీరు?

రాష్ట్రం కళకళలాడిపోతోంది. ‘ఫీల్ గుడ్’ పవనాలు మిమ్మల్ని పులకరింపజేయటం లేదా?
ఆత్మహత్యలా!? వాళ్ళు ఎక్స్‌గ్రేషియాల కోసం చేస్తున్న త్యాగాలవి. ఇటువంటి(ఆత్మహత్యలా?? ఎక్స్‌గ్రేషియాలా?) వాటిని ప్రోత్సహించటం ఆరోగ్యకరం కాదు. భవిష్యత్ తరాలకు(??) ముప్పు. ఉపాధి అవకాశాలు పుష్కలంగా, వ్యవసాయం పచ్చగా, ప్రజల జీవితాలు బంగరాల్లా మెరిసిపోతున్నాయి. అన్ని రంగాల వృద్ధి సూచీలు వేసవి ఉష్ణోగ్రతలను తలపిస్తూ, రికార్డు స్థాయి వృద్ధి రేటు నమోదు చేస్తున్నాయి”.

” అవునవును, వేసవి మంటల్లానే ఉన్నాయి. అన్నదాతలు ఆ మంటల్లొనే మాడి దహించుకుపోతున్నారు “….. ఎకానమీలో అవకతవకల్ని సరిచేయటం అసాధ్యమని, మరిన్ని ఎత్తుపల్లాలను సృజించే సృష్టికర్తలు వీరు. ” మేం రాష్ట్రమంతా తిరిగాం. ఆత్మహత్యల అగత్యమే లేకుండా, ఋణాలు మాఫీ చేస్తాం. రైతులకు ఉచిత విద్యుతిస్తాం, పావలా వడ్డీకే ఋణాలిస్తాం, మాతో చేతులు కలపండి ప్రజలారా.”

మరి చేతులు కలుపుతారా? ఒక్క క్షణం అలోచించండి. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఈ నాయకులు, ఎన్నికలకి ఆమడ దూరంలో శరవేగంగా జనంలోకి ఎందుకు దూసుకొస్తున్నారు?
మునుపంతా ఎం చేశారు?

గాంధీనో, అంబేద్కరో మళ్ళీ పుట్టి, వినూత్నంగా ఎన్నికల్లో నిలబడి, అత్యధిక మెజారిటీతో గెలిచి, పదవులనలంకరించినా, మనకి మేలు చేయగలిగేది మన సొమ్ముతోనేగాని, వాళ్ళ ఆస్థులమ్మి, జనాకర్షక పథకాలు అమలు చేయరు.

అయినా పిచ్చి కాకుంటే, గాంధీ అబేద్కర్‌లు పోటీ చేసి గెలిచే సంస్కృతేనా ఇది??

ఎటువంటి పరిస్థితిలో ఐనా బాగానే ఉన్నారంటూ, ఉచితమంటూ, అనుచితంగా, ఉత్తుత్తి మాటలతో, ఎవరిపట్లా సరైన న్యాయం అవలంబించటం చేతకాక, కులాలనీ, వర్గాలనీ రెచ్చగొడుతూ, ప్రజలలో ఒకరి మీద ఆధారపడే ధోరణినీ, మానసిక దౌర్బల్యాన్నీ పెంచి పోషించటం సరైనదా?

ఎట్టి స్థితిలో ఐనా ఉపాధి అవకాశాల్ని మెరుగుపరుచుకుంటూ, భవిష్యత్ తరాలకు సైతం మార్గదర్శకమయే వృత్తులనూ, వ్యాపార అవకాశాలనూ, ప్రజల స్వశక్తినీ, పలనా సామర్థ్యాన్నీ, ప్రోత్సహించి, పెంచే దిశగా ప్రయాణం సరైనదా??

ప్రభుత్వ ఖజానాలో ధనం జనం కోసం ఖర్చవుతుంది. అదంతా ఏ పార్టీ నాయకుడో జోలెపట్టి జనులను యాచించి కూడగట్టిన నిధీ కాదు, చెమట చిందించి సంపాదించినదీ కాదు, రక్తం ధారపోసి కూడబెట్టిందీ కాదు.

మనది. మనం సమకూర్చిందే అదంతా. మన సొమ్ము మనకిస్తూ మనల్ని ఉద్ధరించటానికే అవతరించినట్టు నటించే ఈ మహా నటులకు బ్రహ్మరథం పట్టండి. పట్టం కట్టకండి.

నటనలో తొణికిసలాడే జీవానికి పులకించి పూలదండలేయడి. ఓట్లు వేయకండి.

*** *** *** *** ***

ఎన్నికల ఫలితాలు, 2004

జరగరానివి జరగటం మన చరిత్ర లక్షణం. ఏం చేస్తాం.
ఐతే వాళ్ళు, లేకపోతే వీళ్ళు.

రాజకీయం ముసుగులో, కులపిచ్చి మసిబారిపోయి, కమ్యూనిజం భాష్యం మార్చేసిన కమ్యూనిస్టులు.

ఢిల్లీ నాయకుల చెప్పులు నాకే విగ్రహపుష్టి నేతల నిర్లక్ష్యానికి నలిగిపోయిన ప్రాంతంలో, యువతను రెచ్చగొట్టి, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తే, సి.ఎం. కుర్చీ కొత్తదే చేయించుకుని అధిష్టించవచ్చనే అవకాశవాద నాయకులు మరికొందరు.

వారంతా గెలిచారు ఈరోజు.

ఓడిందెవరు? వాళ్ళ వోటమిని కోరుకున్న నేనా?

లేక ఆంధ్రదేశమా??

*** *** *** *** *** ***

పాత టపాలు »

Follow

Get every new post delivered to your Inbox.